కర్ణాటకలో వ్యాపారి ఇంట్లో గుట్టలుగా నగదు, బంగారం పట్టివేత (వీడియో)

ఎన్నికల వేళ కర్ణాటకలో వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడటం కలకలం రేపుతోంది.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 11:07 AM IST
cash, gold, seiz,  karnataka, police,

కర్ణాటకలో వ్యాపారి ఇంట్లో గుట్టలుగా నగదు, బంగారం పట్టివేత (వీడియో)

లోక్‌సభ ఎన్నికల వేళ ఇప్పటికే ఎలక్షన్ కోడ్‌ అమల్లోకి వచ్చింది. దాంతో.. పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు అలర్ట్ అయ్యారు. అక్రమంగా నగదు, బంగారం, నగలు తరలించే వారిపై ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తూ భారీ ఎత్తున డబ్బులను సీజ్ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా.. సక్రమంగా ఎన్నికలు నిర్వహించే క్రమంలోనే ఎలక్షన్ కమిషన్ అధికారులు, పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలోని ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్నికల వేళ కర్ణాటకలో వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. బళ్లారిలో ఉంటోన్న స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్‌ సోనీ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లెక్కల్లో లేని రూ.5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలు, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టలుగా పేర్చిన నగదు, ఆభరణాలకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్‌ పోలీసులు ఈ సోదాలు చేసినట్లు తెలుస్తోంది.

హవాలా మార్గంలో నగదు, ఆభరణాలను తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగల వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక పట్టుబడ్డ నగదు, ఆభరణాల వివరాలను ఆదాయపన్ను శాఖకు అందజేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఐటీ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. కాగా.. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26న, మే 4వ తేదీన పోలింగ్‌ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.


Next Story