అయోధ్య రాముడి పాదాల వద్ద వెలిగిన 108 అడుగుల పొడవైన అగర్‌బత్తి
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 5:09 PM IST
అయోధ్య రాముడి పాదాల వద్ద వెలిగిన 108 అడుగుల పొడవైన అగర్‌బత్తి
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే క్రతువులు మొదలయ్యాయి. 22వ తేదీ వరకు రోజూ కార్యక్రమాలు కొనసాగుతాయి. అయితే.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చిన విషం తెలిసిందే. తాజాగా రాముడి భక్తుడు ఒకరు అయోధ్యలో రామాలయం ప్రారంభం సందర్భంగా భారీ అగర్‌బత్తీని తయారు చేశాడు. 3.5 అడుగుల వెడెల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తీని తయారు చేశాడు.
అయితే..ఈ అగర్‌బత్తీ అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. అయోధ్య రాముడికి తన గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలనీ.. గుజరాత్‌లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ భావించాడు. ఈ క్రమంలోనే ఈ భారీ అగర్‌బత్తీని తయారు చేశాడు. తర్సాలీ గ్రామం నుంచి ఈ అగర్‌బత్తీని తయారు చేసి రామాలయానికి అందించాడు. కాగా.. ఈ అగర్‌బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని లేకుండా లేకుండా పోతుందని గ్రామస్తులు అంటున్నారు. నెల నుంచి నెలన్నరవ వరకు వెలుగుతూనే ఉంటుందట. ఈ బాహుబలి అగర్‌బత్తీ తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టిందనీ.. తయారీ కోసం రూ.5 లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు.
అయితే.. ఈ అగర్‌బత్తి తయారీలో 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ తదితర వాటిని ఉపయోగించారు. దీని మొత్తం బరువు 3,400 కిలోలు. గ్రామస్తులంతా ఈ అగర్‌బత్తీ తయారాలో పాలు పంచుకున్నారు. అయోధ్య చేరిన ఈ అగర్‌బత్తిని మంగళవారం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ సమక్షంలో ముట్టించారు.