హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే.. గవర్నర్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు పదే పదే నినాదాలు చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగంలో తన చివరి వాక్యాలను చదివి.. తన ప్రసంగం పూర్తైనట్లుగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రసంగం అనంతరం దత్తాత్రేయ సభ నుంచి బయటకు వస్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు ఆయనను అడ్డుకుని తోశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అధికార బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను సీఎం జైరాం థాకూర్ ఖండించారు. ఈ ఘటనకు కారకులైన ప్రతిపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్షవర్దన్ చౌహాన్, సుందర్ సింగ్ థాకూర్, సత్పాల్ రైజద, వినయ్‌కుమార్‌లను సమావేశాల నుండి సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేశ్ భరద్వాజ్ తీర్మానం ప్రవేశ పెట్టగా స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఆ పార్టీ ఖండించింది.