ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోవచ్చు..

రూ.2వేల నోటు మార్పిడికి ఆర్‌బీఐ మరో రెండు మార్గాలను సూచించింది.

By Srikanth Gundamalla  Published on  2 Nov 2023 7:27 PM IST
rs.2000 note, rbi, currency,

ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోవచ్చు..

కేంద్రం రూ.2వేల నోటును బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి అవకాశం కల్పించిన కేంద్రం.. గడువు అక్టోబర్ 7వ తేదీతో ముగిసింది. ఇప్పటికీ కొంత మంది వద్ద ఈ నోట్లు ఉండటంతో వాటిని మార్చేందుకు తమ దగ్గర్లోని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.2వేల నోటు మార్పిడికి ఆర్‌బీఐ మరో రెండు మార్గాలను సూచించింది. మొదటి విధానంలో దగ్గర్లో ఆర్‌బీఐ కార్యాలయం లేని వాళ్లు బీమా చేసిన పోస్ట్‌ సర్వీసు ద్వారా రూ.2వేల నోట్లను ఆర్‌బీఐకి పంపొచ్చు. రెండో విధానంలో ఆర్‌బీఐ కార్యాలయానికి వెళ్లి క్యూలో నిలబడకుండా టీఎల్‌ఆర్‌ ఫామ్‌ ద్వారా రూ.2 వేల నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ఇంకా రెండు వేల నోట్లు ఉన్నవాళ్లు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవడానికి బీమా చేసిన పోస్టు ద్వారా RBIకి పంపవచ్చు. ఇది సురక్షితమైనది. దీనివల్ల ఆర్‌బీఐ ప్రాంఈయ కార్యాలయానికి వెళ్లాల్సిన బాధ కూడా తప్పుకుంది. ఒక వేళ దగ్గర్లో ఆర్‌బీఐ కార్యాలయం ఉన్నా కూడా.. క్యూలో నిలవడకుండా టీఎల్‌ఆర్‌ ఫామ్‌తో రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు. ఈ టీఎల్‌ఆర్‌ ఫామ్‌ను ఆర్‌బీఐ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్‌ వద్ద పొందవచ్చని అధికారులు వెల్లడించారు. ఫామ్‌పై బ్యాంకు ఖాతా వివరాలు, నోట్ల సంఖ్యను రాసి టీఎల్‌ఆర్‌ ఫామ్‌ డిపాజిట్‌ బాక్సులో వేయాలి. తర్వాత ఆర్‌బీఐ సిబ్బంది వాటిని ఆయా వ్యక్తుల బ్యాంకుఖాతాల్లో జమ చేస్తారు.

ఇక పోస్టు ద్వారా పంపే కవర్‌లో నోట్లతో పాటు, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన ఫామ్‌ను జతచేసి ఇన్సూరెన్స్‌ చేసి ఆర్‌బీఐ కార్యాలయానికి పంపవచ్చు. అంతేకాదు.. వ్యక్తిగతంగా ఆర్‌బీఐ కార్యాలయంలోని కౌంటర్‌ వద్ద రూ.20వేల విలువైన రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు. రూ.2వేల నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తర్వాత అక్టోబరు 8 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2 వేల నోట్ల మార్చుకునేందుకు అనుమతించింది. కాగా.. ఇప్పటికే 97 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story