పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకుంటారా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి దాఖలు చేసిన బెయిల్...
By - అంజి |
పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకుంటారా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు వాగ్దానంతో లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులే" అని పేర్కొంటూ, శారీరక సంబంధాల్లోకి ప్రవేశించే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కోర్టు సూచించింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. నిందితుడు ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ, ఆ విషయం దాచిపెట్టి ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా 30 ఏళ్ల మహిళను పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దుబాయ్‌కి రప్పించి, అక్కడ కూడా సంబంధం కొనసాగించి, చివరికి 2024 జనవరిలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. "బహుశా మనం పాతకాలపు ఆలోచనలు ఉన్నవాళ్లం కావొచ్చు, కానీ పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులే. వారి మధ్య సంబంధం ఎంత బలంగా ఉన్నా సరే, వివాహానికి ముందే శారీరక సంబంధాల్లో పాల్గొనడాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎవరూ కూడా పెళ్లికి ముందు ఇతరులను అంత సులభంగా నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి" అని వ్యాఖ్యానించారు.
బాధితురాలు నిందితుడిని కలవడానికి దుబాయ్‌కి ఎందుకు వెళ్లిందని కోర్టు ప్రశ్నించింది. ఆమె పెళ్లి విషయంలో అంత కచ్చితంగా ఉన్నప్పుడు, వివాహానికి ముందే అంత దూరం ప్రయాణించి వెళ్లకూడదని జడ్జి అభిప్రాయపడ్డారు. "ఇవి పరస్పర అంగీకారంతో జరిగినప్పుడు, వీటిని కేవలం శిక్షించాల్సిన కేసులుగా చూడలేం. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని మేము భావిస్తున్నాం" అని బెంచ్ పేర్కొంది.
ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను గతంలో సెషన్స్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. నవంబర్ 18, 2025న ఢిల్లీ హైకోర్టు తీర్పునిస్తూ.. నిందితుడికి అప్పటికే పెళ్లి కావడం, మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవడం చూస్తుంటే, అతను పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీ మొదటి నుంచీ అబద్ధమని స్పష్టమవుతోందని పేర్కొంది. మోసపూరిత వాగ్దానంతో పొందిన అంగీకారం చట్టబద్ధమైన అంగీకారం కాదని హైకోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తూ, ఇరువర్గాల మధ్య సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉందో లేదో చూడాలని సూచించింది.