ఒడిశాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భోజనం చేసి డబ్బులు ఇచ్చే సమయంలో రూ.5 తక్కువ అయినందుకు కస్టమర్‌పై ఆ హోటల్ యజమాని, అతని కొడుకు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఘసీపూర్‌లో చోటు చేసుకుంది.
జితేంద్ర దేహురి అనే వ్యక్తి 'మా' అనే పేరు గల హోటల్‌లో భోజనం చేశాడు. జితేంద్రకు రూ.45 చెల్లించాలని హోటల్ యజమాని మధు సాహు చెప్పాడు. అయితే తన వద్ద ప్రస్తుతం రూ.40 మాత్రమే ఇస్తానని జితేంద్ర చెప్పడంతో మధు సాహు కోపోద్రిక్తుడయ్యాడు. ఆగ్రహంతో ఇప్పుడు మిగతా డబ్బులు ఇవ్వాలంటూ పట్టుబట్టాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన హోటల్ యజమాని కొడుకు చేరుకున్నాడు. ఇద్దరు కలిసి కస్టమర్ జితేంద్రపై విచక్షణారాహితంగా దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి బయటపడ్డ బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. హోటల్ యజమాని కొడుకు మైనర్ కావడంతో పోలీసులు వదిలేశారు.