ఢిల్లీలో మరో వారం కొనసాగనున్న లాక్ డౌన్

lockdown extended in Delhi. దేశ రాజధాని ఢిల్లీలో రేపటితో ముగియనున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

By Medi Samrat
Published on : 16 May 2021 3:43 PM IST

Delhi CM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కాస్తకాస్తగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రేపటితో ముగియనున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్‌డౌన్‌ పేరుతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే మహామారి తీవ్రతను తగ్గించామని, మరో వారం పాటు కొనసాగించడం ద్వారా కరోనా నుంచి మొత్తానికే బయటపడగలమని అని తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలను చేజార్చుకో కుండా ఉండాలంనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా దిగువకు తీసుకురావడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఢిల్లీలో మునుపటి తో పోలిస్తే పాజిటివ్ రేటు తగ్గినప్పటికి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. మార్చి చివరి వారం నుంచి ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరుగుతూ పోయాయి. దీంతో ప్రభుత్వం నివారణ చర్యలను ప్రారంభించింది. మొదట్లో వీకెండ్ కర్ఫ్యూను అమలు చేసినప్పటికీ ఫలితం పెద్దగా లేకపోవడంతో గత నెల 19 నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కేజ్రీవాల్ ఇలా లాక్ డౌన్ ను పొడిగించడం ఇప్పటికి 4వ సారి. లాక్ డౌన్ తో పాటూ కరోనా రోగులకు సకాలంలో వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఐసోలేషన్ లో ఉన్న వాళ్లకు ఆక్సిజన్ సరఫరా కోసం ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేసింది. కోవిడ్ మేనేజ్మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా కరోనా రోగులకు మరింత తొందరగా సహాయం అందుతుంది.


Next Story