జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజామున దక్షిణ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హతమైయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. రిషిపొరా గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్ కమాండర్ నిసార్ ఖండే మృతి చెందినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు. ఉగ్రవాది నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో సహా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇంకా ఆప్రాంతంలో ఉగ్రవాదుల కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు.