ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్న హిమంత బిశ్వ శర్మ
Himanta Biswa Sarma set to be next Assam CM.అస్సాం ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారనే ఉత్కంఠకు తెరపడింది.
By తోట వంశీ కుమార్ Published on 9 May 2021 2:37 PM GMTఅస్సాం ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారనే ఉత్కంఠకు తెరపడింది. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన శర్బానంద సోనోవాల్ రాజీనామా చేయడంతో హిమంత బిశ్వశర్మను అసోం సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. హిమంత బిశ్వశర్మ సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గువాహటిలో బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కాగా బిశ్వశర్మ పేరును శర్బానంద సోనోవాల్ ప్రతిపాదించారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా హిమంతను ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు. ఆదివారం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించగా.. బీజేపీ పరిశీలకులుగా తోమార్‌తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా సీఎం రేసులో ఉన్న సర్బానంద సోనోవాలే హిమంత బిశ్వ శర్మ పేరును ప్రతిపాదించారు. అప్పటికే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
అసోం అసెంబ్లీలో 126 స్థానాలు ఉండగా, ఇటీవల ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు నెగ్గింది. బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఏజీపీ 9, యూపీపీఎల్ 6 స్థానాలు గెలిచాయి. అసోం కొత్త సీఎం హిమంత బిశ్వశర్మ ఆరేళ్ల కిందట కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. శర్బానంద సోనోవాల్, బిశ్వశర్మ మధ్య ముఖ్యమంత్రి పీఠంపై హై డ్రామా నడిచిన సంగతి తెలిసిందే..! ఎట్టకేలకు హిమంత బిశ్వ శర్మకు ముఖ్యమంత్రి పీఠం లభించింది. హిమంత బిశ్వ శర్మ గత ప్రభుత్వాన్ని కూడా కొనియాడారు. గత 5 సంవత్సరాలు శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలించిందని అన్నారు. శర్బానంద సోనోవాల్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినప్పటికీ మా అందరినీ సరైన మార్గంలో నడిచేలా చేస్తారని అన్నారు.