మందుబాబుల‌కు షాక్‌.. 'లిక్కర్' బాటిల్‌పై రూ.10 ఆవు సుంకం

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల‌పై ‘కౌ సెస్‌’ (ఆవు సుంకం) విధించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2023 10:23 AM IST
Himachal Pradesh, cow cess,

లిక్కర్' బాటిల్‌పై రూ.10 ఆవు సుంకం

మందుబాబుల‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం షాకిచ్చింది. మ‌ద్యం అమ్మ‌కాల‌పై ‘కౌ సెస్‌’ (ఆవు సుంకం) విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు వెల్ల‌డించారు. దీంతో ప్ర‌తీ మ‌ద్యం సీసాపై రూ.10 పెర‌గ‌నుంది.

శుక్ర‌వారం అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. కౌసెస్ గురించి తెలిపారు. కౌసెస్ ద్వారా సంవ‌త్స‌రానికి రూ.100 కోట్ల ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ఆదాయాన్ని గోవుల సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 30,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రైవేటు రంగంలో లెక్కిస్తే దాదాపు 90,000 కొత్త ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు చెప్పారు.

చిన్న రిజర్వాయర్ల నిర్మాణానికి చేపల పెంపకందారులకు 80 శాతం సబ్సిడీ లభిస్తుంది. రాష్ట్ర హరితహారంలో భాగంగా ప్రభుత్వం జలవిద్యుత్ మరియు సౌరశక్తిని ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర రోడ్‌వేస్ కార్పొరేషన్‌కు చెందిన 1,500 డీజిల్ బస్సులను రూ.1,000 కోట్లతో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్లు సుఖు తెలిపారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న 20 వేల మంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.25,000 అందజేస్తామని సుఖు చెప్పారు.

యువతకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ, రెండు మెగావాట్ల వరకు చిన్న హైడల్ ప్రాజెక్టు ఏర్పాటుకు 40 శాతం రాయితీ లభిస్తుంది. ప్రతి జిల్లాలో రెండు పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చనున్నారు. తమ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

Next Story