ప్రారంభ‌మైన హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌.. ఓటేసిన సీఎం జైరామ్‌

Himachal Pradesh CM Jairam Thakur cast his vote in Seraj Assembly constituency.హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2022 4:49 AM GMT
ప్రారంభ‌మైన హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌.. ఓటేసిన సీఎం జైరామ్‌

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైంది. గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. రాష్ట్రంలోని 68 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జ‌రుగుతోంది. మొత్తం 412 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. డిసెంబ‌ర్ 8న వీరి భ‌విత‌వ్యం తేల‌నుంది.

రాష్ట్రంలో మొత్తం 55,92,828 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 28,54,945 మంది పురుషులు, 27,37,845 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మ‌రో 38 మంది థర్డ్ జెండర్లు కూడా తమ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 7,884 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 1,625 పోలింగ్ స్టేషన్లు ఉండగా, లాహౌల్-స్పితి జిల్లాలో అత్యల్పంగా 92 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 7,235 పోలింగ్ స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో 646 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి

2017లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 44 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లకు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ త్రిముఖ(కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్‌ల మ‌ధ్య‌) పోరు నెల‌కొని ఉంది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా రెండు సార్లు ఏ పార్టీకి ప‌ట్టం క‌ట్ట‌ని హిమాచ‌ల్ ప్ర‌జ‌లు ఈ సారి అదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తారా..? లేక చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తారో చూడాలి.

ఓటేసిన సీఎం జైరామ్‌..

సిరాజ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జైరామ్ థాకూర్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. మండీలోని 44వ పోలింగ్ స్టేష‌న్‌లో ఆయ‌న ఓటేశారు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌న్న‌ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నార‌ని తెలిపారు.

Next Story