మోగిన ఎన్నిక‌ల న‌గారా.. ఒకే విడ‌త‌లో హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌లు

Himachal Pradesh Assembly elections on November 12.దేశంలో మ‌రో ఎన్నిక‌ల న‌గారా మోగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2022 4:14 PM IST
మోగిన ఎన్నిక‌ల న‌గారా.. ఒకే విడ‌త‌లో హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌లు

దేశంలో మ‌రో ఎన్నిక‌ల న‌గారా మోగింది. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం(సీఈసీ) ప్ర‌క‌టించింది. ఒకే విడత‌లో న‌వంబ‌ర్ 12న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవ‌ల ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించి ఎన్నిక‌ల స‌న్న‌ద్ద‌త‌పై స‌మీక్షించిన అనంత‌రం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు. డిసెంబ‌ర్ 8న ఓట్ల లెక్కింపును చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను అక్టోబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు నామినేష‌న్ల‌ దాఖ‌లుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అక్టోబ‌ర్ 27న‌ నామినేష‌న్‌లను ప‌రిశీలిస్తారు. అక్టోబ‌ర్ 29 వ‌ర‌కు నామినేష‌న్‌ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 జ‌న‌వ‌రి 8న ప్ర‌స్తుత అసెంబ్లీ గ‌డువు ముగియ‌నుంది. 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి 43, కాంగ్రెస్ 22 స్థానాలు ద‌క్కించుకున్నాయి. మ‌రోసారి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌ని బీజేపీ భావిస్తోండ‌గా గెలిచేందుకు ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ కూడా గ‌ట్టిగానే క‌స‌ర‌త్తులు చేస్తోంది.

మొత్తం 12 జిల్లాలో 55,07,261 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో 27,80,208 ప‌రుషులు కాగా.. 22,27,016 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్నారు.

Next Story