నేడే హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు.. సెక్షన్‌ 144 అమలు, స్కూళ్లు, కాలేజీలు మూసివేత

Hijab row.. Karnataka High Court to pronounce judgment today. కర్నాటక హైకోర్టు హిజాబ్ వివాదం కేసులో ఇవాళ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. హిజాబ్ కేసులో 1

By అంజి  Published on  15 March 2022 2:59 AM GMT
నేడే హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు.. సెక్షన్‌ 144 అమలు, స్కూళ్లు, కాలేజీలు మూసివేత

కర్నాటక హైకోర్టు హిజాబ్ వివాదం కేసులో ఇవాళ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. హిజాబ్ కేసులో 11 రోజుల వరుస విచారణల అనంతరం ఫిబ్రవరి 25న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు తీర్పుకు ముందు బెంగళూరులో ఎలాంటి నిరసనలు లేదా సమావేశాలను నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు. బెంగళూరులోని అధికారులు మార్చి 15 నుండి ఒక వారం పాటు నగరంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 144 విధించారు. హిజాబ్ కేసులో తమ వాదనలను ఫిబ్రవరి 25లోగా ముగించాలని కర్ణాటక హైకోర్టు కోరింది. ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జెఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మార్చి 15, మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. బెంగళూరు నగరంలో ఎలాంటి నిరసనలు, సమావేశాలకు అనుమతి లేదు.

హిజాబ్ వివాదం అంటే ఏమిటి?

కర్ణాటకలోని కోస్టల్ టౌన్ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించినందుకు ఆరుగురు ముస్లిం బాలికలను తరగతులకు హాజరుకాకుండా నిషేధించడంతో జనవరి 1న కర్ణాటక హిజాబ్ గొడవ ప్రారంభమైంది. హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు ప్రతిస్పందనగా, హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు, కుంకుమ జెండాలు ఊపుతూ, విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించినట్లయితే తమ మతపరమైన దుస్తులు, చిహ్నాలను ప్రదర్శించడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు పాకింది, ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది.

శివమొగ్గలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు.. సెక్షన్ 144 అమలులో ఉంది

హిజాబ్ అభ్యర్థనపై తీర్పుకు ముందు, శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ ఆర్ సెల్వమణి.. జిల్లాలో మార్చి 15 మంగళవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన జిల్లాలో సిఆర్‌పిసి (నిషేధం) సెక్షన్ 144 విధించారు. ఈ ఉత్తర్వు మార్చి 15 ఉదయం 6 గంటల నుండి మార్చి 21 రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటుంది. తీర్పుపై ఎలాంటి వేడుకలు జరపకూడదనే ఆంక్షలు కూడా ఉన్నాయి. శివమొగ్గ నగరంలో ఎనిమిది కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు, ఒక రిజర్వ్ ఆర్మ్డ్ ఫోర్స్ ట్రూప్‌ను మోహరించినట్లు శివమొగ్గ పోలీస్ సూపరింటెండెంట్, బీఎమ్‌ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.

ఇవాళ హిజాబ్ వివాదం తీర్పును దృష్టిలో ఉంచుకుని, కలబురగిలో మార్చి 14 సోమవారం రాత్రి 8 గంటల నుండి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉన్న సెక్షన్ 144 విధించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మార్చి 15వ తేదీ మంగళవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని కలబురగి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యశ్వంత్ వి గురుకర్ తెలిపారు.

Next Story