హైవేపై ఫేక్ టోల్‌గేట్.. ఏడాదిగా రూ.కోట్లు వసూలు
జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు మనకు సాధారణంగానే టోల్ ప్లాజాలు ఎదురవుతుంటాయి.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 1:45 PM ISTహైవేపై ఫేక్ టోల్‌గేట్.. ఏడాదిగా రూ.కోట్లు వసూలు
జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు మనకు సాధారణంగానే టోల్ ప్లాజాలు ఎదురవుతుంటాయి. అయితే.. రోడ్లను కొన్ని ప్రయివేట్ కంపెనీ సంస్థలు వేయిస్తాయి. వారు చేసిన ఖర్చును తిరిగి తీసుకోవడం కోసం టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తాయి. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. దీని కోసం ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఓ చోట మాత్రం దీన్ని ఆసరగా తీసుకున్నారు. వారికివారే రోడ్డు వేయించి.. సొంతంగా టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. ఏడాది నుంచి ప్రభుత్వం అనుమతి లేకుండానే వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. దాదాపు 80 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. గుజరాత్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
మోసాలు చేయడానికి ఏది కాదు అనర్హం అన్నట్లుగా తయారయారు కొందరు వ్యక్తులు. గుజరాత్‌లో ఈ వింత సంఘటన వెలుగు చూసింది. మోర్బి జిల్లాలోని మోర్బి-వాంకనేర్ గ్రామాల 18 నెలల క్రితం ఉన్నట్లుండి రోడ్డును బాగు చేయించారు.ఆ తర్వాత రోడ్డును బాగు చేయించినందుకు గాను డబ్బులు వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే టోల్‌గేట్‌ను ఏర్పాటు చేశారు. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. కార్లకు రూ.100 చొప్పున.. లారీలకు రూ.200 చొప్పున వసూలు చేశారు. 18 నెలల పాటు ఇదే మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. ఇటీవల కొందరికి అనుమానం వచ్చి ప్రభుత్వం అనుమతుల గురించి ఆరా తీయగా ముఠా అసలు బాగోతం బయటపడింది.
సదురు టోల్‌గేట్‌లో డిజిటల్ పేమెంట్స్ కానీ.. ఫాస్టాగ్ వంటి సౌకర్యలు ఉండేవి కావు. నేరుగా డబ్బులు మాత్రమే తీసుకునే వారు. ఫాస్టాగ్ గురించి ఎవరైనా అడిగితే స్టేట్ హైవేకు అనుబంధంగా ఉన్న రహదారి అని నేషనల్ హైవే కాదని సమాధానం చెప్పేవారు. పలువురి ఫిర్యాదుల మేరకు దర్యాప్తు జిల్లా కలెక్టర్ పాండ్యా దర్యాప్తునకు ఆదేశించారు. టోల్‌గేట్ అక్రమంగా నిర్మించారని దర్యాప్తులో తేలింది. ఐదుగురు వ్యక్తులు కలిసి టోల్‌గేట్ నిర్మించారని తేలింది. దాంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితులు అమర్షి పటేల్, రవిరాజ్‌సింగ్ ఝాలా, హర్విజయ్‌సిన్హ్ ఝాలా, ధర్మేంద్రసింగ్ ఝాలా, యువరాజ్‌సిన్హ్ ఝాలాగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కావడం గమనార్హం.