BUDGET 2025: కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్ 2025 - 26ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించారు.
By అంజి Published on 1 Feb 2025 12:42 PM ISTBUDGET 2025: కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్ 2025 - 26ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు భవిష్యత్ ఆహార భద్రత కోసం రెండో జన్యు బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు పెంచామని తెలిపారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఎగుమతులు పెంచేలా ఎంఎస్‌ఎంఈ, వాణిజ్య శాఖ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఎగుమతుల డాక్యుమెంటేషన్ విషయంలో, ఎగుమతులకు ఉద్దేశించిన ప్రత్యేక వస్తువులకు అదనపు సాయం చేస్తామన్నారు. జ్ఞాన భారత్ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని ద్వారా ఐఐటీ, ఐఐఎస్ విద్యార్థులకు రూ.10 వేల కోట్ల ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. మ్యూజియాలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న పురాతత్వ ప్రతుల పునరుద్ధరణం సాయం చేస్తామన్నారు. దీంతో సామాజిక సంక్షేమ సర్‌ఛార్జ్ తొలగించనున్నట్టు కేంద్రమంత్రి ప్రటించారు. సెస్‌లు పడే 82 టారిఫ్ లైన్లపై సామాజిక సంక్షేమ సర్‌ఛార్జ్ తొలగిస్తున్నట్టు చెప్పారు. కోబాల్ట్ ఉత్పత్తులు, ఎల్‌ఈడీ, జింక్, లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు సహా 12 క్రిటికల్ మినరల్స్‌కు కస్టమ్స్ సుంకం తొలగిస్తున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అలాగే షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే జన విశ్వాస్ 2.O బల్లును తీసుకొస్తామన్నారు. వందకు పైగా నిబంధనలను నేరరహత లక్ష్యంగా ఈ బిల్లు ఉంటుందన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై అదనపు శ్రద్ధ పెట్టనున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. మెడికల్ టూరిజం ప్రోత్సాహనికి వీసా నిబంధనలు మరింత సులభతరం చేస్తామన్నారు. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ఉప సంహరణ, ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్ ఉంటుందన్నారు.
చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 2030 నాటికి నాలుగు చిన్న, మధ్య స్థాయి రియాక్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 74 శాతం నుంచి నూరు శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడుతామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
జల్ జీవన్ మిషన్‌కు మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించామన్నారు. రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పారు. క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఉడాన్ పథకాన్ని మరో 120 రూట్లలో అమలు చేస్తామని చెప్పారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు నిర్మలా సీతారామన్ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్ప కాలిక రుణాలతో 7.7 కోట్ల మంది రైతులు, జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలపై మాట్లాడారు. బడ్జెట్‌లో ముఖ్యంగా రూరల్ ఎకానమీపై భారీగా ఫోకస్ పెట్టారు. 1.7 కోట్ల రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రతిపాదనలను నిర్మల సభకు వినిపించారు.