రెప్పపాటులో ఊరినే ముంచేసిన వరద (వీడియో)

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురుస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 July 2023 1:05 PM IST
Heavy Rain, Floods, Himachal Pradesh

రెప్పపాటులో ఊరినే ముంచేసిన వరద (వీడియో)

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాల కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీరు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. కొండచరియలు విరిగి పడుతున్నాయి. రహదారులపై పెద్దపెద్ద బండరాళ్లు పడి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాంతో జాతీయ రహదారులను సైతం అధికారులు మూసివేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే.. వంతెనలు తెగిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరదలు ముంచెత్తడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదలు ముంచెత్తుతున్న వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొండ కాలువలో ఉన్న మండలి జిల్లాలోని ఒనైర్‌ గ్రామాన్ని జల ప్రవాహం చుట్టుముట్టింది. గ్రామంలో ఉన్న నివాసాల్లోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చింది. కొన్ని ఇళ్లు ధ్వంసమైయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం వరద ధాటికి కుప్పకూలాయి. చెట్లు, బురద గ్రామంలోకి కొట్టుకువచ్చింది. వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోగా.. మరికొందరు అక్కడే ఉన్నారు. పెద్ద భవనాలపైకి ఎక్కి నిల్చున్నారు. ఎంతో భయానకంగా ఉన్న వరదతో హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్ ఒక్కటే కాదు.. ఉత్తర భారతం మొత్తం భారీ వర్షాలతో వణికిపోతుంది. ఉత్తరాధిలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ ప్రదేశ్, పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో మూడ్రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఆయా రాష్ట్రాల్లో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలుగ్రామాల మధ్య వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.

కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దేశంలో ఇప్పటి వరకు 19 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు వరదల్లో గల్లంతు అయ్యారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. యమున సహా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్‌ జారీ చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వర్షాలు, వరదల నుంచి తప్పించుకునేందుకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

Next Story