ఒక ఎమర్జెన్సీ పిలుపు రాగానే మెడికల్ టీమ్ మొత్తం ఏ మాత్రం భయపడకుండా అడవిలో ప్రయాణం మొదలు పెట్టారు. ఎందుకంటే కాపాడాల్సింది గూడెం లోని ప్రజలను కాబట్టి..! ట్రైబల్ గ్రామంలో ప్రజలకు ఆరోగ్యం సరిగా లేదని తెలియగానే కేరళకు చెందిన ఓ మెడికల్ టీమ్ అడవిలో కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. మధ్యలో వాగులను దాటుకుంటూ.. ఎలాగోలా అడవిలో ఉన్న గ్రామానికి చేరుకొని వైద్యం అందించారు.
కురుంబా ట్రైబల్ జాతికి చెందిన ఇరుళ, ముడుగర్ లలో 100 మంది ఉంటారు. వారిలో ముగ్గురికి ఆరోగ్యం బాగాలేదని.. హై ఫీవర్ తో బాధపడుతూ ఉన్నారని పుట్టూర్ డామిసిలరి కేర్ సెంటర్ కు సమాచారం అందించింది. ఆ గ్రామానికి చేరుకోవాలంటే అట్టపాడీ నుండి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అయితే వాహనంలో వెళ్లడం కుదరలేదు.. భవానీపుళ నది వరకే వాహనాలను తీసుకుని వెళ్లారు. అక్కడి నుండి నదిని దాటాల్సి ఉంటుంది. ఆ నదిని ఎట్టకేలకు దాటిన టీమ్ మరో ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అట్టపాడీ అడవుల్లోని గ్రామానికి చేరుకున్నారు. 30 మందికి వైద్యులు ర్యాపిడ్ టెస్టులు చేయగా ఏడు మందికి కరోనా సోకిందని నిర్ధారణ అయింది. వెంటనే వారిని పుట్టూర్ డామిసిలరి కేర్ సెంటర్ కు తీసుకుని వెళ్లారు.
ఈ విషయాన్ని కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డాక్టర్ సుకన్య, హెల్త్ ఇన్స్పెక్టర్ సునీల్ వాసు, జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శైజి, డ్రైవర్ రాజేష్ లను అభినందించారు. అడవిలో ఏ మాత్రం భయపడకుండా ఎమర్జెన్సీ కాల్ రాగానే స్పందించినందుకు వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. అడవిలోని వాళ్ళను అలాగే వదిలేసి ఉండి ఉంటే కరోనా మహమ్మారి దెబ్బకు గ్రామం మొత్తం తుడిచిపెట్టుకు పోయుండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. నెటిజన్లు కూడా ఈ బృందాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు.