మందుబాబులకు శుభవార్త.. మద్యం తాగేందుకు వయసును సడలించిన ప్రభుత్వం
Haryana lowers age limit to consume alcohol to 21.మందుబాబులకు నిజంగా ఇది శుభవార్తే. ఇప్పటి వరకు 25 సంవత్సరాలు
By తోట వంశీ కుమార్ Published on 23 Dec 2021 3:16 AM GMTమందుబాబులకు నిజంగా ఇది శుభవార్తే. ఇప్పటి వరకు 25 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే మద్యాన్ని విక్రయిస్తుండగా.. తాజాగా దాన్ని 21 సంవత్సరాలకు తగ్గిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం హర్యానా ప్రభుత్వం తన ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది, రాష్ట్రంలో మద్యం వినియోగం.. దాని కొనుగోలు లేదా అమ్మకం కోసం చట్టపరమైన వయస్సును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించడానికి మార్గం సుగమం చేసింది. దీనికి సంబంధించి హర్యానా ఎక్సైజ్ (సవరణ) బిల్లు 2021ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.
ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఆధారంగా అప్పటి చట్టాన్ని తీసుకువచ్చారని, ఇప్పటి ప్రజల జీవన విధానం పూర్తిగా మారిందన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఉన్నత విద్యావంతులుగా మారారన్నారు. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందుకనే నేటి పరిస్థితులకు అనుగుణంగా ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. బుధవారం హర్యానా అసెంబ్లీలో ఎక్సైజ్‌తో సహా మొత్తం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి.
ఇప్పటి వరకు.. హర్యానా ఎక్సైజ్ చట్టం 1914లోని సెక్షన్ 27 ప్రకారం 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం మద్యం లేదా టోకు లేదా రిటైల్ విక్రయాల లీజును మంజూరు చేయదు. సెక్షన్ 62 ప్రకారం లైసెన్స్ పొందిన విక్రేత లేదా అతని ఉద్యోగి లేదా అతని తరపున పనిచేసే ఎవరైనా సరే 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి మద్యం లేదా డ్రగ్‌ను విక్రయించినా, పంపిణీ చేసినా శిక్షతో పాటు 50 వేల జరిమానా విధిస్తున్నారు.
ఇటీవల నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కూడా వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ వయసు వారు మద్యపానం విషయంలో హేతుబద్దమైన నిర్ణయాలు తీసుకుంటారని అభిప్రాయపడడంతో వయసును తగ్గించారు.