గుజరాత్ వరదల్లో చిక్కుకున్న భారత స్పిన్నర్.. కాపాడిన NDRF
గుజరాత్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 12:30 PM ISTగుజరాత్ వరదల్లో చిక్కుకున్న భారత స్పిన్నర్.. కాపాడిన NDRF
గుజరాత్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే 28 మందికి పైగా మంది భారీ వర్షాల కారణంగా చనిపోయారని అధికారులు చెప్పారు. వరద నీటిలో పలు ప్రాంతాలు మునిగాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగా సహాయక చర్యలు చేస్తున్నాయి.
వడోదరలో వర్షం పడటం ఆగిపోయినా పరిస్థితులు మాత్రం దారుణంగానే కొనసాగుతున్నాయి. విశ్వమిత్రి నదికి వరద పోటెత్తడంతో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అయితే.. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ కుటుంబం కూడా చిక్కుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమని రక్షించినట్లు రాధా యాదవ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. మేమంతా వరదలోనే చిక్కుకుని పోయాం. మమ్మల్ని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ధన్యవాదాలు అంటూ రాధా యాదవ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
అయితే.. గుజరాత్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. నాలుగో రోజు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే 18వేల మంది వరద బాధితులను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గుజరాత్‌లో భారీ వర్షాలు, వరదలపై ఆరా తీశారు. సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి.. సహాయక చర్యలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.