ప్రేమికుల దినోత్సం వచ్చేసింది. ఈ రోజున ప్రేమికులు తమ ప్రేయసీలకు బహుమతులు ఇస్తూ.. వారిపై తమకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే.. ఓ భర్త తన భార్యకు ప్రేమికుల దినోత్సవం రోజున ఎవరూ ఇవ్వని గిఫ్ట్‌ను ఇచ్చాడు. అది కూడా వారి 23వ వివాహ వార్షికోత్సం సందర్భంగా.. భార్యకు కిడ్నిని ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో రీతా పటేల్, వినోద్ పటేల్ దంపతులు నివసిస్తున్నారు.
రీతా పటేల్ గత మూడు సంవత్సరాలుగా కిడ్సీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె కిడ్నీ పాడైంది. దీంతో ఆమెకు కిడ్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెకు కిడ్ని ఇచ్చేందుకు భర్త వినోద్ ముందుకు వచ్చాడు. పరీక్షలు నిర్వహించిన భర్త కిడ్ని భార్యకు సరిపోతుందని వైద్యులు ధృవీకరించడంతో నేడు(వాలెంటైన్స్) దినోత్సవం రోజున కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ను నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ చికిత్స జరగనుంది.
దీనిపై వినోద్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా తన భార్య బాధపడుతుందని.. గత నెల నుంచి డయాలసిస్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తన బాధను చూసిన తర్వాత కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడ్డానని తెలిపాడు. తన భార్య వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలని, ప్రతీ ఒక్కరూ తన భాగస్వామికి గౌరవం ఇవ్వాలన్న సందేశం ఇస్తున్నానని వినోద్ చెప్పాడు. తన భర్త ప్రేమికుల రోజున ఇచ్చిన అరుదైన బహుమతి గురించి రీతా స్పందిస్తూ.. ఇలాంటి భర్తను పొందటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన వల్లే తాను మళ్లీ సంతోషంగా జీవించేందుకు పునర్జన్మ లభించిందని చెప్పింది.