గుజరాత్‌లో భారీ వర్షాలు, 28 మందికి పైగా మృతి
గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 4:15 AM GMTగుజరాత్‌లో భారీ వర్షాలు, 28 మందికి పైగా మృతి
గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లో పలు చోట్ల రోడ్లపైకి భారీ గా వరద నీరు చేరింది. దాంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు చాలా ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగి పడి రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. భారీ వర్షాలతో వరదలు పోటెత్తడంతో 28 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ అధికారులు చెప్పారు. పశ్చిమ ప్రాంతాలపై వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు.
వడోదరలో 10 నుంచి 12 అడుగుల మేర నీరు నిలిపోయిందని అధికారులు చెప్పారు. అక్కడ వరదలో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు అందించేందుకు సైన్యం కూడా సహకారం అందించాలని స్థానిక అధికారులు కోరుతున్నారు. అయితే.. వరదల ప్రభావం ఇప్పటికే 40వేల మందిపై పడిందనీ.. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిచే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆజ్వా ఆనకట్ట ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నీటి నిల్వ 25 అడుగుల గరిష్టానికి చేరుకుంది. దాంతో.. ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దాదాపు వడోదరలో సహాయక చర్యల్లో భాగంగా 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పారు. గుజరాత్‌లో వర్షాలు గురువారం కూడా పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ చేసింది భారత వాతావరణ కేంద్రం.
గుజరాత్‌లో భారీ వర్షాలు, వరదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ కాల్ చేసి అన్ని వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. వడోదరాలో సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి NDRF బృందాలు, ఆర్మీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.