పెళ్లయిన గంటలోనే ఘర్షణ, వధువు మృతి.. ఆస్పత్రిలో వరుడు
పెళ్లి జరిగిన గంటకే వధువు, వరుడు తీవ్రంగా ఘర్షణ పడ్డారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 1:15 PM ISTపెళ్లయిన గంటలోనే ఘర్షణ, వధువు మృతి.. ఆస్పత్రిలో వరుడు
పెళ్లిళ్లలో గొడవలు జరగడం సహజం. ఆ తర్వాత పెద్దలు చెప్పడం లేదంటే.. వారువారే మాట్లాడుకుని గొడవలకు గుడ్‌బై చెప్పి పెళ్లి తతంగాలను పూర్తిచేస్తారు. కానీ.. కర్ణాటకలో మాత్రం ఓ పెళ్లి వేడుకలో అనుకోని సంఘటన జరిగింది. పెళ్లి జరిగిన గంటకే వధువు, వరుడు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో వధువు ప్రాణాలు కోల్పోయింది. వరుడు మాత్రం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. లిఖితశ్రీ, నవీన్‌బాబు ఇద్దరి పెద్దలు వివాహం నిశ్చయించారు. అనుకున్నట్లుగానే బుధవారం ముహూర్తం పెట్టి పెళ్లి ఘనంగా జరిపించారు. అయితే.. స్థానిక కల్యాణ మండపం దగ్గరే వరుడు నవీన్ మేనమామ ఇల్లు ఉంది. బంధుమిత్రుల ఆశీర్వాదలను తీసుకుని.. వివాహ వేడుక పూర్తయిన తర్వాత వరుడు, వధువుతో కలిసి మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడే సమస్య మొదలైంది.
ఇంట్లో అందరూ టీ, కాఫీలు తాగుతుండగా.. వధూవరులు మాట్లాడుకోవడానికి ఒక గదిలోకి వెళ్లారు. కాసేపు అయ్యాక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరు గొడవ పడటం ప్రారంభించారు. చేతికి దొరికిన వస్తువులతో దాడి చేసుకున్నారు. గదిలో నుంచి అరుపులు విన్న బంధువులు.. బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేసి చూశారు. అప్పటికే నవ వధువు లిఖితపై వరుడు నవీన్ కొడవలితో దాడి చేస్తున్నాడు. అయితే.. వధువు తీవ్రగాయం కావడంతో ఎక్కువగా రక్తస్రావం అయ్యింది. కేజీఎఫ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు లిఖిత ప్రాణాలు కోల్పోయింది. ఇక వరుడు నవీన్ కు కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లయిన గంటలోనే ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు