దేశంలో లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్

Govt not going for lockdowns in big way. భారతదేశంలో పూర్తీ స్థాయిలో లాక్ డౌన్ అయితే ఉండదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.

By Medi Samrat  Published on  14 April 2021 1:32 PM IST
Nirmala Sitharaman about lockdown

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇటీవలి కాలంలో భారత్ లో లక్షన్నరకు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 1,84,372 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 82,339 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 1,027 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,72,085 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,23,36,036 మంది కోలుకున్నారు.

కరోనా కేసులు ఇలాగే పెరిగిపోతే భారత్ లో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే పూర్తీ స్థాయిలో లాక్ డౌన్ అయితే ఉండదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి కోసం పెద్ద ఎత్తున లాక్ డౌన్ విధించమని, స్థానిక నియంత్రణ మాత్రమే చేపడతామని నిర్మలా సీతారామన్ అన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకాలు, కరోనా మార్గదర్శకాల అమలులాంటి ఐదు స్తంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామని సీతారామన్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఉండదని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కరోనా రోగులను ఇళ్లలో క్వారంటైన్ చేస్తామని చెప్పారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్ పాస్ తో జరిగిన వర్చవల్ సమావేశంలో భారతదేశానికి రుణం పెంచడానికి ప్రపంచబ్యాంకు చేపట్టిన చర్యలను కూడా నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.


Next Story