టమాటా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు
టమాటా పంటను ప్రభుత్వం అధిక సంఖ్యలో సేకరించి.. సబ్సిడీ కింద వినియోగదారులకు అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
By News Meter Telugu Published on 12 July 2023 8:30 PM ISTటమాటా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు
ప్రధాన నగరాల్లో టమాటాలను తక్కువ ధరకు పంపిణీ చేయడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (NAFED) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని మండీల నుండి టమాటాలను వెంటనే కొనుగోలు చేయాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF)ని ఆదేశించింది. టమాటా పంటను ప్రభుత్వం అధిక సంఖ్యలో సేకరించి.. సబ్సిడీ కింద వినియోగదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరల తగ్గింపు చర్యల్లో భాగంగా అధికంగా టమాటాలను పండించిన రాష్ట్రాల నుంచి పంటను సేకరించనున్నారు. దీని కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టింది. టమాటా పంటను కొనుగోలు చేయాలని నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెట్ ఫెడరేషన్ - నాఫెడ్, నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో వినియోగించే టమాటా పంటలో దాదాపు 58 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తాయి. అందులో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి టమాటా పంటను భారీగా సేకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో టమాటా ధర భారీగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీగా ధర పలుకుతున్నందున అక్కడి వినియోగదారులకు తక్కువ ధరకు టమాటాను అందించాలని అధికారులు నిర్ణయించారు. మహారాష్ట్ర నుంచి టమాటాను గుజరాత్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా, నారాయణంగావ్, నాసిక్ ప్రాంతాల నుంచి జులై నెల చివరి వరకు టమాటా పంటను ఇతర రాష్ట్రాలకు తరలిస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహర శాఖ తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధి, హిమాచల్ ప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు టమాటాలను కర్ణాటక నుంచి పంపించనున్నారు.
టమాటోల ఉత్పత్తి సీజన్లు:
టమాటోలు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ పెంచుతూ ఉన్నారు. అయితే భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాంతాలలో టొమాటోలు మిగులు రాష్ట్రాలు కాబట్టి, సీజన్ల ఆధారంగా ఇతర మార్కెట్‌లకు అందిస్తాయి.ప్రాంతాలను బట్టి కూడా ఉత్పత్తి చేసే సీజన్లు మారుతూ ఉంటాయి. కోత కాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. టొమాటో ఉత్పత్తి సాధారణంగా జూలై-ఆగస్టు, అక్టోబర్-నవంబర్ నెలలలో తక్కువగా ఉంటుంది. వర్షాకాలం, పంపిణీలో సమస్యలు, రవాణా ఖర్చుల కారణంగా టమాటా ధరల పెరుగుదల ఉంటుంది.
ప్రస్తుత సరఫరా:
ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు సరఫరా ఎక్కువగా జరుగుతూ ఉంది. మహారాష్ట్రలో ప్రత్యేకించి సతారా, నారాయణగావ్, నాసిక్ నుండి వస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు సరఫరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె (చిత్తూరు)లో కూడా డిమాండ్ బాగా ఉంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ నుండి వస్తుంటాయి. కర్ణాటకలోని కోలార్ లో కూడా టమాటాలకు డిమాండ్ ఉంది.
కొత్త పంట రాక:
నాసిక్ జిల్లా నుండి త్వరలో కొత్త పంటల దిగుబడి అవుతుంది. ఆగస్టులో నారాయణగావ్, ఔరంగాబాద్ బెల్ట్‌ల నుండి అదనపు సరఫరా వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున టమాటా పంట వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా సమీప భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.
ధరలలో హెచ్చుతగ్గులు:
టమాటా ధర కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఎక్కువగా నాటడం, కోత సీజన్లు లేకపోవడం, సరఫరా సరిగా లేకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగా పంట నష్టం, ఇతర విషయాల కారణంగా ధరల పెరుగుదలకు కారణం అవుతాయి.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలు బాగా నష్టపోవడం, ఖర్చులు ఊహించని విధంగా పెరగడం వలన టమోటా ధరలు పెరిగాయి. విపరీతమైన ఎండల కారణంగా రైతులు పంటలు వేయలేకపోతున్నారు. అకాల వర్షాలు కూడా పంటలను దెబ్బతీస్తున్నాయి.