చిన్న పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చుట్టూ తిరుగుతున్న కామాంధుల నుండి పిల్లలను రక్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలా గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి చెప్పడంతో ఓ స్కూల్ లో టీచర్ చేసిన దారుణాలు బయటపడ్డాయి.
1 నుండి 3వ తరగతి చదువుతున్న బాలికలను అనుచితంగా తాకుతున్నాడని గుర్తించిన తర్వాత లైంగిక వేధింపుల ఆరోపణలపై ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామపెద్దల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు.
'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' గురించి మాట్లాడేందుకు మరో టీచర్ విద్యార్థులను కలిశాడు. ఆ సమయంలో పిల్లలు 'బ్యాడ్ టచ్' ఎదురైన విషయాన్ని ప్రస్తావించారు. ఓ ఉపాధ్యాయుడు తమతో తరచుగా అలా చేశారని పిల్లలు వివరించారు. షాక్ తిన్న టీచర్ ఏం జరిగిందో గ్రహించాడు. నిందితుడైన టీచర్ చాలా కాలంగా బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తేలింది. పిల్లల తల్లిదండ్రుల నిరసన నేపథ్యంలో పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.