దీపావళి తర్వాత సీఎం యోగి ఆదిత్యానాథ్ గుడ్‌న్యూస్
Good news for the unemployed I దీపావళి తర్వాత సీఎం యోగి ఆదిత్యానాథ్ గుడ్‌న్యూస్
By సుభాష్ Published on 13 Nov 2020 8:21 AM IST
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకు సాగుతూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనున్నారు. కరోనా ప్రభావంతో నిరుద్యోగులుగా మారిన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా యూపీ సర్కార్ సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ పథకాన్ని దీపావళి పండగ తర్వాత శ్రీకారం చుట్టబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 'మిషన్ రోజ్‌గార్' పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం యోగి సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.
ఈ ఏడాది నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు దాదాపు 50 లక్షల మందికిపైగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద యువతీ, యువకులు ఆయా ప్రభుత్వ శాఖల్లో, మండలాల్లో, కార్పొరేట్లు తదితర సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం చొరవతో ప్రైవేటు సంస్థలు సైతం అనేక రంగాల్లో ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మిషన్ రోజ్‌గార్ అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దమైనట్లు యూపీ సీఎస్ రాజంద్ర కుమార్ తివారీ తెలిపారు.