కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. కొత్త పెన్షన్ విధానం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు అందించింది.

By Srikanth Gundamalla  Published on  25 Aug 2024 2:40 AM GMT
good news,  central government, employees, pension

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. కొత్త పెన్షన్ విధానం

.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగ విరమణ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగేలా ఏకీకృత పెన్షన్ పథకం (UPS) విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం వల్ల 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. అదే జరిగితే లబ్ధి పొందే ఉద్యోగుల సంఖ్య 90 లక్షలకు పెరుగుతుందని అధికారులు అంటున్నారు. అయితే.. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జాతీయ పింఛన్ పథకం (ఎన్‌పీఎస్) అమల్లో ఉంది. అయితే.. దీని నుంచి యూపీఎస్‌కు మారేందుకు అవకాశం కల్పిస్తారు. కొత్త విధానం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న తర్వాత.. వేతనంలో 50 శాతం పెన్షన్ లభిస్తుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. అయితే, కనీస పెన్షన్ రావాలంటే మాత్రం పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని అధికారులు చెబుతున్నారు. యూపీఎస్ విధానంలో ఉద్యోగ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న మూల వేతనం (బేసిక్) సగటులో సగం పెన్షన్‌గా అందుతుంది. ఉద్యోగులు దీనిని ఎంచుకోవడం ద్వారా వారిపై అదనంగా ఎలాంటి భారం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 10 శాతం చందానే చెల్లిస్తే సరిపోతుందని చెబుతున్నారు.

Next Story