135 చిలుకలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఘజియాబాద్‌లో చిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 7:35 PM IST135 చిలుకలను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ స్మగ్లర్ వందకు పైగా చిలుకలు, నాలుగు తాబేళ్లను రెండు పంజరాల్లో కుక్కి తీసుకెళ్లాడు. అయితే.. ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు చిలుకలు భారీ సంఖ్యలో చనిపోయాయి.
ఘజియాబాద్‌లో కొందరు వ్యక్తులు పక్షులను అక్రమంగా తరలిస్తున్నారని పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో.. ఇరువురు కలిసి నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఫైజాన్ ఖాన్ అనే వ్యక్తి రాంపూర్ నుంచి 200 చిలుకలు, నాలుగు తాబేళ్లను తీసుకుని కౌశాంబి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. దాంతో.. పీఎఫ్‌ఏ ప్రతినిధులు అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. అతడిని గుర్తించిన పోలీసులు, పీఎఫ్‌ఏ సభ్యులు ఫైజాన్‌ను అడ్డుకున్నారు. నిందితుడు ఆటో రిక్షాలో రెండు బోన్లలో తెల్లటి గుడ్డ కప్పి పక్షులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులతో పాటు పీఎఫ్‌ఏ సభ్యులను గమనించిన ఫైజాన్.. వారిపై కత్తితో దాడిచేసి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం ముగ్గురు సభ్యుల ముఠా ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు ఫైజాన్ కాగా అతడు పట్టుబడ్డాడు. మరో ఇద్దరు నిందితులు తౌఫిక్ ఖాన్, షకీల్ ఖాన్ పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. కాగా.. దురదృష్టవశాత్తు 125 చిలుకలు చనిపోయాయని పోలీసులు వెల్లడించారు. అన్ని చిలుకలను బోనులో బంధించడం ద్వారా శ్వాస అందకపోవడం వల్ల చనిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక మరో నాలుగు తాబేళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. నిందితులు పక్షులను మీరట్, ఢిల్లీలో విక్రయించేందుకు అక్రమంగా తీసుకెళ్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై హత్యాయత్నం, వన్యప్రాణి సంరక్షణ చట్టం సహా పలు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.