కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వాలు అన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. అందరికి వ్యాక్సిన్ అందిచాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ప్రజా రవాణా అన్ని చోట్ల అందుబాటులోకి వస్తోంది. గురువారం నుంచి ముంబైలో అన్ని లోకల్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనాకు ముందులా పూర్తి సామర్థ్యంతో వీటిని నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముంబైలోని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రయాణించే ప్రయాణీకులు తప్పనిసరిగా రెండు డోసుల టీకాను తీసుకోవాలని స్పష్టం చేసింది.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారిని రైలులో ప్రయాణీంచేందుకు అనుమతించరు. ఇంతక ముందు కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న తరువాత 14 రోజులు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతించారు. కరోనాకు ముందు ముంబై సబర్చన్ రైళ్లలో రోజుకు దాదాపు 80లక్షల మంది ప్రయాణించేవారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 22 నుంచి సబర్భన్ రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఏడాది జూన్ నుంచి కొన్ని రైళ్లను మాత్రమే నడుపుతుండగా.. ఈ నెల 28 నుంచి 100శాతం రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.