ప్రయాణికురాలికి ఇచ్చిన ఆహారంలో పురుగు.. ఇండిగోకు షోకాజ్ నోటీసు
ప్రయాణీకులకు అసురక్షిత ఆహారాన్ని అందించినందుకు దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆహార భద్రత నియంత్రణ సంస్థ FSSAI షోకాజ్ నోటీసు జారీ చేసింది.
By అంజి Published on 4 Jan 2024 9:17 AM ISTప్రయాణికురాలికి ఇచ్చిన ఆహారంలో పురుగు.. ఇండిగోకు షోకాజ్ నోటీసు
విమానంలో అందించిన శాండ్‌విచ్‌లో పురుగు కనిపించిన కొద్ది రోజుల తర్వాత, ప్రయాణీకులకు అసురక్షిత ఆహారాన్ని అందించినందుకు దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆహార భద్రత నియంత్రణ సంస్థ FSSAI షోకాజ్ నోటీసు జారీ చేసింది. తమకు షోకాజ్ నోటీసు అందిందని, ప్రోటోకాల్ ప్రకారం స్పందిస్తామని బుధవారం ఎయిర్‌లైన్స్ తెలిపింది. డిసెంబరు 29న ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే 6E 6107 విమానంలో ఈ ఘటన జరిగింది. సదరు ప్రయాణికుడు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో ఎయిర్‌లైన్ క్షమాపణలు చెప్పింది.
జనవరి 2న, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తన లైసెన్స్‌ను సస్పెండ్ చేయడానికి లేదా రద్దు ఎందుకు చేయకూడదో కారణం చూపాలని, అలాగే షోకాజ్ నోటీసు ప్రకారం.. విమానంలోని ప్రయాణికురాలికి అసురక్షిత ఆహారాన్ని అందించినందుకు ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ (FSS) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. నోటీసుపై స్పందించేందుకు విమానయాన సంస్థకు ఏడు రోజుల గడువు ఇచ్చింది.
ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ.. "ఢిల్లీ నుండి ముంబైకి 6E 6107 విమానంలో అందించిన ఆహార పదార్థానికి సంబంధించి FSSAI నుండి షోకాజ్ నోటీసు అందిందని, మేము ప్రోటోకాల్ ప్రకారం నోటీసుకు ప్రతిస్పందిస్తాము" అని చెప్పారు. గత వారం, కుష్బూ గుప్తా అనే మహిళా ప్రయాణీకురాలికి విమానంలో అందించిన శాండ్‌విచ్‌లో పురుగు కనిపించింది. ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్న తర్వాత, ఇండిగో క్షమాపణలు చెప్పింది. విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. విమానంలో శాండ్‌విచ్‌లో పురుగు ఉన్న చిన్న వీడియోను ప్రయాణీకురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.