నేటి నుంచి వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్
From Today complete lockdown in tamil nadu. వారం పాటు (సోమవారం నుంచి) సడలింపులు లేని సంపూర్ణ లాక్‌డౌన్ ను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 24 May 2021 7:21 AM ISTకరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ల బాట పట్టగా మరికొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక తమిళనాడు రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ పాక్షిక లాక్‌డౌన్‌తో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కొందరు యథేచ్చగా తిరుగుతున్నారు. ఒకప్పుడు అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో వస్తుండగా.. ప్రస్తుతం తమిళనాడులో ఆ పరిస్థితి ఉంది. దీంతో తమిళనాడులో కొత్తగా ఏర్పడిన స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో శనివారం వైద్య నిపుణలు, శాసన సభాపక్ష పార్టీల ప్రతినిధులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అందరూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలని వైద్య నిపుణులు కోరారు. శాసనసభాపక్ష పార్టీల ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి సూచనల మేరకు వారం పాటు (సోమవారం నుంచి) సడలింపులు లేని సంపూర్ణ లాక్‌డౌన్ ను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2.75 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
కాగా.. ఇప్పటి వరకు 50 శాతం సిబ్బందితో పని చేసిన కార్యాలయాలు కూడా మూత పడ్డాయి. ప్రజలు ఎవ్వరూ కూడా రోడ్లపైకి రాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు నిన్నటి వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేటి నుంచి అన్ని షాపులు కూడా మూత పడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా నిత్యం రద్దీగా కనిపించే రోడ్లు.. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.