కరోనా కేసులను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తోచినంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో కూడా లాక్ డౌన్ అమలులో ఉంది. చాలా మంది తిండి దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ కార్డు ఉన్నా కూడా రెండు నెలల పాటూ ఉచితంగా రేషన్ ను సప్లై చేస్తామని అన్నారు. ఇక ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఒక సారి ఆర్థికంగా కూడా సహాయం చేస్తామని తెలిపారు. అలాగని లాక్ డౌన్ రెండు నెలల పాటూ ఉంటుందని చెప్పడం లేదని అన్నారు. అయితే కరోనా కేసులు వీలైనంత త్వరగా తగ్గిపోతే లాక్ డౌన్ ను ఎత్తివేస్తామని అన్నారు.

రాజధానిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో లాక్ డౌన్ ను మూడు వారాల కిందట అమలు చేశారు. రోజు కూలీలు.. చాలా వరకూ ఉపాధిని కోల్పోయారు. రోజుకూలీలను ఆదుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గత వారం 5000 రూపాయలు రిజిస్టర్ చేసుకున్న భవన నిర్మాణ కూలీలకు ఇచ్చామని తెలిపారు. ఎంతో మంది వద్ద సేవింగ్స్ ఉండవని.. వారిని వీలైనంత వరకూ ఆదుకుంటామని తెలిపారు. టాక్సీ, ఆటోలు నడుపుతున్న వారిని ఆదుకోడానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నామని అన్నారు. ఈ డబ్బులు వారి కష్టాలన్నీ తీరుస్తాయని అనుకోవడం లేదని.. అయితే కొంచెం అయినా సహాయపడుతుందని భావిస్తున్నానని కేజ్రీ వాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


సామ్రాట్

Next Story