మహిళలకు శుభవార్త.. నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలోని బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
By తోట వంశీ కుమార్ Published on 8 March 2023 8:34 AM ISTప్రతీకాత్మక చిత్రం
మహిళలకు శుభవార్త. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(BMTC) మహిళలకు ఓ కానుక ఇచ్చింది. బెంగళూరు నగరంలో నేడు(బుధవారం) మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
బెంగళూరు నగరంలోని ఏ బస్సుల్లోనైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సాధారణ బస్సులతో పాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. కెంపెగౌడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టికెట్ లేకుండానే ప్రయాణించవచ్చునని బీఎంటీసీ తెలిపింది.
మహిళలు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ వాడే బదులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు వాడాల్సిందిగా బీఎంటీసీ అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుందని, ఇది సురక్షితమైన ప్రయాణమని అంటున్నారు.
కాగా.. బెంగళూరు నగరంలో గతంలో ఇలా ఒక్కసారి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. బీఎంటీసీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా గతేడాది ఆగష్టు 15న బెంగళూరు నివాసితులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు మరోసారి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల్పించడం మాత్రం ఇదే తొలిసారి.
BMTC కార్పొరేషన్ 6,600 బస్సులను కలిగి ఉంది. ప్రతిరోజూ 5,567 బస్సుల షెడ్యూల్‌లను నడుపుతోంది. 50,000 ట్రిప్పుల ద్వారా 10.84 లక్షల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. సగటున 29 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.