నది వద్ద రీల్స్ చేస్తూ నీట మునిగి నలుగురు మృతి
నదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 May 2024 11:12 AM ISTనది వద్ద రీల్స్ చేస్తూ నీట మునిగి నలుగురు మృతి
ప్రస్తుతం చాలా మంది యువత సోషల్ మీడియాకు అంకితం అవుతున్నారు. వీడియోలు తీసుకుంటూ.. వాటిని నెట్టింట పోస్టు చేస్తున్నారు. లైక్స్ కోసం తెగ ఆరాట పడుతున్నారు. తద్వారా ఫేమస్ అవ్వాలనుకుని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా కొందరు వింత పనులు చేసి ప్రమాదాల్లో ఇరుక్కున్న సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఆరుగురు గంగా నది వద్ద రీల్స్ చేసేందుకు ప్రయత్నించారు. అనుకోకుండా నదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
బీహార్‌లోని ఖగారియా జిల్లా పర్బట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అగువాని ఘాట్ వద్దకు శనివారం ఒక 16 ఏళ్ల బాలికతో పాటు ఆమె సోదరుడు, నలుగురు యువకులు రీల్స్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆరుగురు రీల్స్ చేస్తూ లీనమైపోయారు. అనుకోకుండా వచ్చిన నీటి ప్రవావ ఉధృతిని వారు గమనించలేదు. అంతే.. ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో వారు నీట మునిగిపోయారు. ఆరుగులు నీటిలో పడ్డ విషయాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే స్పందించి వారు నీటిలోకి దూకారు. ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. కానీ.. నలుగురు గంగా నదిలోనే గల్లంతు అయ్యారు.
ఇక ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు చెప్పగా..వెంటనే వారు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలతో బయటపడిన శ్యామ్ కుమార్ (24), అతని సోదరి సాక్షి కుమారి (16)గా గుర్తించారు. ఇక గంగా నదిలో గల్లంతు అయిన వారి వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. నిఖిల్ కుమార్ (23), ఆదిత్య కుమార్ (18), రాజన్ కుమార్ (16), శుభం కుమార్ (16)గా పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి మృతదేహాల కోసం గత ఈతగాళ్లతో వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.