పంజాబ్ రాష్ట్రంలోని ఓ ఆర్మీ క్యాంప్‌పై కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. భటిండా మిలిటరీ స్టేషన్‌లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని భారత సైన్యం యొక్క సౌత్ వెస్ట్రన్ కమాండ్ తెలిపింది. కాల్పుల శబ్దం వినబడగానే స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్‌లు వెంటనే అలర్ట్ అయ్యాయి. క్యాంప్‌ను సీలు చేసినట్లు సైన్యం తెలిపింది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగినట్లు సైన్యం తెలిపింది.
భటిండా ఎస్‌ఎస్‌పీ గుల్నీత్ ఖురానా మాట్లాడుతూ.. సురక్షితమైన క్యాంపస్‌లో ఎదో జరిగిందని ప్రాథమిక సమాచారంగా పేర్కొన్నారు. అయితే సైన్యం వివరాలను ఇప్పుడే పంచుకోలేనని చెప్పారు. ఆర్మీ అంతర్గత కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇది ఉగ్రదాడి కాదని, మిలిటరీ స్టేషన్‌లో కొంత అంతర్గత పరిణామంగా అనిపిస్తోందని ఎస్‌ఎస్పీ ఖురానా అన్నారు. రెండు రోజుల క్రితం స్టేషన్‌లోని ఆర్టిలరీ యూనిట్‌లో కొన్ని ఆయుధాలు మాయమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తప్పిపోయిన ఈ ఆయుధాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.