కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ క‌న్నుమూత‌

Former Union minister Sharad Yadav dies aged 75.మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ క‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2023 8:19 AM IST
కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ క‌న్నుమూత‌

సోష‌లిస్ట్ నేత‌, జేడీయూ మాజీ అధ్య‌క్షుడు, మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. గురువారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్నుగురుగ్రామ్‌లోని ఫొర్టిస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చే స‌రికి అప‌స్మార‌క స్థితిలో ఉన్నారు. ప‌ల్స్ లేదు. సీపీఆర్ చేశాం. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. రాత్రి 10.30 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న మ‌ర‌ణించారు. అని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయ‌న వ‌య‌స్సు 75 సంవ‌త్స‌రాలు. శరద్ యాదవ్ మృతిని ఆయన కూతురు సుభాషిణి శరద్ యాదవ్ ధ్రువీకరించారు. పప్పా నహీ రహే అని ఆమె ట్వీట్ చేశారు.

1947 జులై 1 మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లాలో శ‌ర‌ద్ యాద‌వ్ జ‌న్మించారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఏడు సార్లు లోక్‌స‌భ‌కు, మూడు సార్లు రాజ్య స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వాజ్‌పేయీ ప్ర‌భుత్వంలో ప‌లు మంత్రిత్వ శాఖ‌లు నిర్వ‌హించారు. జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. 2018లో లోక్‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ పార్టీని స్థాపించారు. 2022లో పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

శరద్ యాదవ్ మరణించడం బాధాకరం. ప్రజా జీవితంలో సుదీర్ఘ కాలం పాటు ఎంపీగా, మంత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతను డాక్టర్ లోహియా యొక్క ఆదర్శాల నుండి గొప్పగా ప్రేరేపించబడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్‌, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే సంతాపం తెలియ‌జేశారు. సింగ‌పూర్ ఆస్ప‌త్రిలో ఉన్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ వీడియో సందేశాన్ని పంపారు.

Next Story