రూ.2.5 లక్షల విలువైన టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు
కర్ణాటకలో ఓ రైతు దగ్గర నుంచి రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దొంగలు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 11:57 AM GMTరూ.2.5 లక్షల విలువైన టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులు టమాటాలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు పాటను గుర్తు చేసుకుంటున్నారు. టమాటా ఒక్కటే కాదు.. పచ్చిమిర్చి, ఇతర కూరగాయలు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాల్లో టమాటా ధరలు ఒక్కో రేటు ఉంది. కిలో టమాటా ధర రూ.120 నుంచి రూ.180 దాకా పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా పండించే రైతులు తమ పంటను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాత్రుళ్లు దొంగలు పడి ఎత్తుకుపోకుండా కాపలా కాస్తున్నారు. అయినా కూడా కొందరు కేటుగాళ్లు తమ వక్రబుద్ధిని చూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఓ రైతు దగ్గర రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దొంగలు.
కర్ణాటకలోని హసన్ జిల్లా గోని సమోనహళ్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ధరణి..తనకు ఉన్న రెండు ఎకరాల్లో టమాటాను సాగు చేసింది. అయితే.. నీళ్లు బాగా ఉండటంతో పంట బాగా పండింది. టమాటా చేతికొచ్చింది రెండ్రోజుల్లో తెంపి మార్కెట్‌కు తీసుకెళ్లాలని భావించింది. ధరలు బాగా ఉండటంతో తనకు కాసుల వర్షం కురుస్తుందని అనుకుంది. కానీ అంతలోనే ఆమెకు దొంగలు ఊహించని షాక్ ఇచ్చారు. రాత్రి రాత్రే టమాటా పొలంలో దొంగలు పడ్డారు. 50 నుంంచి 60 బ్యాగుల టమాటాను దొంగిలించారు. అపహరణకు గురైన టమాటా విలువ దాదాపు రూ.2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ధరణి చెబుతోంది. దొంగలు తమకు కుదిరినంత పంటను ఎత్తుకెళ్లి మిగతాది నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. డబ్బులు బాగా వస్తాయనుకుంటే రూపాయి కూడా రాకుండా చేయడంతో సదురు రైతు కన్నీరు పెట్టుకుంటుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలు ఎవరో కనిపెట్టేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తమకు పంట కలిసి వచ్చిందని.. డబ్బులు బాగా వస్తాయని తెలిసిన వారే ఎవరో తట్టుకోలేక పంటను నాశనం చేసి టమాటాలను ఎత్తుకెళ్లారని బాధిత మహిళా రైతు ధరణి అనుమానం వ్యక్తం చేస్తోంది.
Tomatoes worth Rs 2.5 lakh stolen in Karnataka's HassanRead @ANI Story | https://t.co/2akpXOVevQ#TomatoPrice #Karnataka #Hassan pic.twitter.com/iulQU2mdIe
— ANI Digital (@ani_digital) July 6, 2023