రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు..!
For How Many Generations Will Reservation Continue Asks SC.భారత సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 20 March 2021 9:58 AM GMTభారత సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మరాఠా రిజర్వేషన్ కేసు విచారణ సందర్భంగా ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఉద్యోగాలు, విద్యకు సంబంధించి ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ రిజర్వేషన్లపై పరిమితి విధించిన 'మండల్ తీర్పు' 1931 జనాభా లెక్కల ప్రకారం ఉన్నందున మారిన పరిస్థితుల దృష్ట్యా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ కోటాలను పరిష్కరించడానికి కోర్టులు ఆయా రాష్ట్రాలకు వదిలివేయాలని వాదించారు.
'వాదనలు విన్న ధర్మాసనం మీరు చెబుతున్నట్లు 50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే ఆ తరువాత తలెత్తే అసమానతల పరిస్థితేంటి? అంతిమంగా మేం ఏం తేల్చాల్సి ఉంది. ఈ అంశంపై మీ వైఖరేంటి? ఇంకా ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు' అని ధర్మాసనం ప్రశ్నించింది. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి, రాష్ట్ర ప్రభ్వుతాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా.. వెనుకబడిన సామాజిక వర్గంలో ఏ మాత్రం అభివృద్ధి లేదన్న విషయాన్ని మనం అంగీకరించగలమా' అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అభివృద్ధి జరిగింది కానీ, వెనుకబడి తరగతులు 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోలేదు. ఈ దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు కొనసాగుతున్నాయి.
జనాభా పెరగడంతో సమాజంలో వెనుబడిన వర్గాలు సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్యలు చేసింది ధర్మాసం. పరిమితి లేకుండా రిజర్వేషన్లను పెంచుకుంటూ పోతే.. సమానత్వానికి ప్రాతిపదిక ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. పరిమితి లేని రిజర్వేషన్ల వల్ల ఏర్పడే అసమానతల మాటేమిటని అడిగింది. మరెన్ని తరాలకు రిజర్వేషన్లను కల్పిస్తారని ప్రశ్నించింది.