మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్‌తో.. ఐదేళ్ల బాలిక మృతి

అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలిక మంగళవారం మరణించింది.

By అంజి
Published on : 21 May 2024 2:01 PM IST

Malappuram, Kerala , brain eating amoeba, amoebic meningoencephalitis

మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్‌తో.. ఐదేళ్ల బాలిక మృతి

కేరళలోని మలప్పురం జిల్లాలో కలుషితమైన నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ అయిన అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలిక మంగళవారం మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక్కడి మూన్నియూర్ పంచాయతీకి చెందిన చిన్నారి కోజికోడ్ మెడికల్ కాలేజీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందిందని వారు తెలిపారు.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వేచ్చగా జీవించే, నాన్-పారాసిటిక్ అమీబా బాక్టీరియా కలుషితమైన నీటి నుండి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. బాలిక మే 1న సమీపంలోని చెరువులో స్నానం చేసిందని, మే 10 నాటికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత చికిత్సలో బాలిక వెంటిలేటర్‌పై ఉంది. మందులకు స్పందించలేదు.

అదే చెరువులో బాలికతో పాటు స్నానం చేసిన ఇతర పిల్లలు కూడా పరిశీలనలో ఉన్నారు. అయితే, వారికి ఇన్‌ఫెక్షన్ లేదని గుర్తించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యాధి ఇంతకుముందు 2023, 2017లో రాష్ట్రంలోని తీరప్రాంత అలప్పుజా జిల్లాలో నివేదించబడింది. ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ.

Next Story