ఒడిశాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఢెంకనల్ నగర శివారులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇన్‌స్టిట్యూట్‌లో ఉదయం ప్రార్థన సమయంలో కుప్పకూలి మృతి చెందాడు. వెంటనే అతడిని ఢెంకనాల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటన దెంకనల్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరపాడు ఐటీఐ కళాశాలలో జరిగింది.
మృతుడు కామాఖ్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరాల్ సరదీపూర్ నివాసి అభిజిత్ దాస్ (17)గా గుర్తించారు. అసిస్టెంట్ ట్రైనింగ్ లెక్చరర్ ధనేశ్వర్ బెహెరా చెప్పిన వివరాల ప్రకారం.. "విద్యార్థి హాస్టల్‌లో ఉంటున్నాడు. అతను ప్రార్థన సమయానికి వచ్చాడు. ప్రార్థన ప్రతి రోజూ ఉదయం 9:00 నుండి 9:25 వరకు ఉంటుంది. 5-10 నిమిషాలు నిలబడిన తర్వాత, అతను నేలపై పడిపోయాడు. మేము వెంటనే అతనిని మా కారులో జిల్లా ఆసుపత్రికి తరలించాము, కాని అతను చనిపోయినట్లు డాక్టర్ ప్రకటించారు.'' అని చెప్పారు.
ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి అసలు కారణం తెలియనుంది.