దేశంలోనే ఫస్ట్‌టైమ్.. 12 కిలోల కాలేయాన్ని తొలగించిన కిమ్స్ వైద్యులు
First time in the country, Kim's doctors removed a 12 kg liver from a woman's body. హైదరాబాద్: ఎవరికైనా కాలేయం 12 కిలోల బరువు ఉందంటే అసలు వైద్య చరిత్రలోనే నమ్మడం చాలా కష్టం.
By అంజి Published on 8 Dec 2022 3:40 PM ISTహైదరాబాద్: ఎవరికైనా కాలేయం 12 కిలోల బరువు ఉందంటే అసలు వైద్య చరిత్రలోనే నమ్మడం చాలా కష్టం. ఒక మహిళ పాలీసిస్టిక్ లివర్ అండ్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నారంటే ఆమె ప్రాణాలు కాపాడటం వైద్యులకు అతిపెద్ద సవాలు. కానీ ఒకేరోజు కాలేయం, మూత్రపిండాలు కూడా మార్చేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ముగ్గురు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, ఒక మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడితో కూడిన బృందం అవిశ్రాంతంగా పనిచేసి, ఆ గృహిణి ప్రాణాలు కాపాడారు.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి.. 12 కిలోల బరువున్న కాలేయాన్ని తొలగించి, విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం భారతదేశంలోనే ఇదే మొదటిసారి. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి ప్రాంతానికి చెందిన ఉషా అగర్వాల్ అనే 50 ఏళ్ల గృహిణికి ఈ శస్త్రచికిత్సలు చేసి, ఆమె ప్రాణాలు కాపాడటమే కాదు.. సాధారణ పరిస్థితికి తీసుకొచ్చారు కూడా. కాలేయం ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే, అది దాదాపు ఉదరభాగం మొత్తాన్ని ఆక్రమించి, పేగులను కూడా పక్కకు తోసేసింది. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో అయితే కాలేయం బరువు 1.5 కిలోలు మాత్రమే ఉంటుంది. అది ఉదరంలో కుడివైపు పైభాగంలో పావువంతు మాత్రమే ఉంటుంది.
కాలేయం ఇంత పెద్దగా పెరిగిపోవడం, కడుపులోకి విపరీతంగా నీరు చేరడం, హెర్నియా కూడా ఏర్పడటంతో ఆమెకు నడవడం కూడా కష్టమైంది. ఇంత భారీగా అనిపించడంతో 2019లోనే ఆమెకు కాలేయమార్పిడి చేయాలని వైద్యులు సూచించారు.
ఈ కేసు గురించి కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్, చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్, హెచ్‌పీబీ సర్జరీ డాక్టర్ రవిచంద్ సిద్దాచారి మాట్లాడుతూ.. ''పాలీసిస్టిక్ లివర్ అండ్ కిడ్నీ డిసీజ్ అనేది జన్యువులలో మ్యుటేషన్ వల్ల ఏర్పడే వంశపారంపర్య వ్యాధి. దీనివల్ల మూత్రపిండాలు, కాలేయంలో నీటితిత్తులు (సిస్టులు) ఏర్పడతాయి. 30లలో ఉన్నంతకాలం రోగులకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కనిపించదు. కానీ, సిస్టులు పెరిగేకొద్దీ వారికి క్రమంగా లక్షణాలు బయటపడతాయి. అవి చాలా భారీ పరిమాణంలోకి పెరిగిపోతాయి, కడుపులోకి నీరు చేరి, చివరకు హెర్నియా, ఊపిరి అందకపోవడం లాంటి సమస్యలొస్తాయి. మూత్రపిండాల పనితీరు సైతం దెబ్బతినడంతో వారికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. భారీ హెర్నియా ఏర్పడటం, అది పగలడంతో ఈ రోగికి ఈ సమస్యలన్నీ వచ్చాయి'' అని తెలిపారు.
ఇదే కేసు గురించి కన్సల్టెంట్ యూరాలజిస్టు, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ''కాలేయం ఉదరభాగం మొత్తాన్ని ఆక్రమించడంతో శస్త్రచికిత్స చేయడం చాలా కష్టంగా మారింది. ముందుగా కాలేయాన్ని ఉదరం నుంచి వేరు చేయడమే పెద్ద పని అయ్యింది. అదే సమయంలో కాలేయంలోని ముఖ్య భాగాలను అలాగే ఉంచి, కాలేయ మార్పిడి చేయాల్సి వచ్చింది. కానీ విజయవంతంగా కొత్త కాలేయాన్ని అమర్చాం. సాధారణంగా మూత్రపిండాల మార్పిడికి వేరేచోట కోత పెట్టాల్సి వస్తుంది. కానీ మేం మాత్రం అదే కోత ద్వారా, ఉదరంలో ఒక పౌచ్ పెట్టడం ద్వారా మూత్రపిండాన్ని కూడా అదే శస్త్రచికిత్సలో మార్చేశాం'' అని వివరించారు.
ఒకే రోజు ఒకే రోగికి రెండు అరుదైన శస్త్రచికిత్సలు చేసిన ఈ వైద్యులు.. రోగి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి తిరిగి వెళ్తుండటంతో ఎంతో ఆనందించారు.
''ఇది చాలా సంతృప్తికరమైన ఆపరేషన్లలో ఒకటి. దీనివల్ల రోగి ప్రాణాలను కాపాడటమే కాదు, ఆమె అన్నిరరకాల శారీరక, మానసిక సమస్యల నుంచి కూడా శాశ్వతంగా బయటపడ్డారు. ఆమె ఇక ఎలాంటి ఇబ్బందీ లేకుండా తన రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు'' అని చెప్పారు.
మొత్తం 14 గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్సలలో కాలేయమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు కన్సల్టెంట్, చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్, హెచ్‌పీబీ సర్జరీ డాక్టర్ రవిచంద్ సిద్దాచారి, సీనియర్ కన్సల్టెంట్ హెపటోబైలియర్ పాంక్రియాస్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సచిన్ డాగా, కన్సల్టెంట్ హెచ్‌పీబీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కె.ఎన్. పరమేశ, కన్సల్టెంట్ యూరాలజిస్టు, రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. శస్త్రచికిత్సల తర్వాత చీఫ్ హెపటాలజిస్టు డాక్టర్ శరత్‌పుట్టా, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ వి.ఎస్. రెడ్డి రోగిని కంటికి రెప్పలా కాపాడారు.