1997లో 59 మందిని బలితీసుకున్న సినిమా థియేటర్.. ఇప్పుడు మళ్లీ అగ్నిప్రమాదం

1997లో 59 మందిని బలితీసుకున్న సినిమా థియేటర్.. ఇప్పుడు మళ్లీ అగ్నిప్రమాదం- ఉపహార్ థియేటర్.. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ సినిమా థియేటర్ గతం గురించి తెలుసుకుంటే అందరూ షాక్ అవుతారు. 1997 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఏకంగా 59 మంది మరణించారు.

By Medi Samrat  Published on  17 April 2022 6:46 AM GMT
1997లో 59 మందిని బలితీసుకున్న సినిమా థియేటర్.. ఇప్పుడు మళ్లీ అగ్నిప్రమాదం

ఉపహార్ థియేటర్.. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ సినిమా థియేటర్ గతం గురించి తెలుసుకుంటే అందరూ షాక్ అవుతారు. 1997 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఏకంగా 59 మంది మరణించారు. ఇప్పుడు అదే థియేటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్దనున్న థియేటర్ లో తెల్లవారుజామున 4.46 గంటలకు థియేటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. థియేటర్ లో ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్ బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయన్నారు. ఉదయం 7.20 గంటలకు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

1997 జూన్ 13న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని థియేటర్ లో మంటలు వ్యాపించి 59 మంది చనిపోయారు. ప్రమాదం వల్ల జరిగిన తొక్కిసలాటలో మరో 103 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆ గాయం తాలూకు మరకలు ఇంకా చెరిగిపోలేదు. ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన కేసు కోర్టులో నలుగుతూనే ఉంది. 2015 ఆగస్టు 19న ఢిల్లీ కోర్టు థియేటర్ యజమాని సుశీల్ అన్సాల్ సోదరులకు రూ.30 కోట్ల చొప్పున జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో తుది తీర్పు వెలువరించిన కోర్టు, ఆధారాలను నాశనం చేశారన్న ఆరోపణలపై అన్సాల్ సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష, మరో రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. తమ ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని అన్సాల్ సోదరులు సుశీల్, గోపాల్ అన్సాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారంటూ అనూప్ సింగ్‌తో పాటు ఉపహార్ సినిమా యజమానులైన అన్సల్ సోదరులు ప్రేమ్ ప్రకాష్ బాత్రా, హర్స్వరూప్ పన్వార్, ధరమ్‌వీర్ మల్హోత్రా, దినేష్ చంద్ర శర్మలపై ఆరోపణలు వచ్చాయి. ట్రయల్ కోర్టు జనవరి 31, 2003న కేసుకు సంబంధించిన కొన్ని పత్రాలు కోర్టు రికార్డు గది నుండి కనిపించకుండా పోవడంతో విచారణకు ఆదేశించింది. విచారణ తర్వాత, ఒక కోర్టు ఉద్యోగిని సర్వీస్ నుండి తొలగించారు.

Next Story