ఒకే రోజు రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు

ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 Aug 2023 5:49 AM GMT
Fire accident,  two trains, one day ,

ఒకే రోజు రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు 

మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఎస్‌-2 బోగిలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దాంతో.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన నాగ్‌పుర్‌ వద్ద చోటు చేసుకుంది. అయితే.. మంటలను గమనించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. పొగలను గమనించిన రైల్‌లో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. రైల్‌లో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇక మరో రైలు ప్రమాద ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. క్రాంతివీర సంగోల రాయన్న రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. స్టేషన్‌లో హాల్ట్‌ చేసిన ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా చూస్తుండగానే స్టేషన్‌ మొత్తం పొగ వ్యాపించింది. దాంతో.. భయపడిపోయిన ప్రయాణికులు రైలుకు దూరంగా పరుగులు తీశారు. దాంతో.. రైల్వే స్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే.. రైల్వే స్టేషన్‌లోనే ఈ ఘటన జరగడంతో సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో కూడా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అందరూ క్షేమంగా ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం 5:45 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ప్లాట్‌ఫామ్‌ నెంబర్ 3పై హాల్ట్‌ చేశామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత ఉదయం 7:10 గంటల ప్రాంతంలో రైల్‌లోని బీ-1, బీ-2 కోచ్‌ల నుంచి పొగలు రావడం మొదలైందని తెలిపారు. క్షణాల వ్యవధిలోనే మంటలు కూడా ఎగిసిపడ్డాయని అధికారులు చెప్పారు. దాంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులను అక్కడి నుంచి క్షేమంగా తరలించామని చెప్పారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వాళ్లూ వెంటనే రైల్వే స్టేషన్‌కు చేరుకుని మంటలు ఆర్పేశారని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. ఈ సంఘటనలోనూ మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో రైల్వేలో వరుస ప్రమాదాలు జరుగుతుండటం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది.

Next Story