చికెన్ కోసం వెళ్లిన ఇద్దరు యువకులకు, చికెన్ షాపు ఓనర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గొడవ కొంచెం పెద్దదిగా మారి రెండు వర్గాలు రాళ్లు రువ్వుకునేలా చేసింది. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అలీఘర్‌లోని సాస్ని గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరాయ్ సుల్తానీ చౌకీ సమీపంలోని షాపులో చికెన్ కొనేందుకు ఇద్దరు యువకులు వెళ్లారు. ఈ క్రమంలోనే వివాదం జరిగింది. రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదంలో చాలా సేపు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆకాష్, సిద్ధార్థ్, నరేష్ గౌతమ్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. గాయపడిన యువకులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు రాళ్ల దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న ఐజీ దీపక్‌కుమార్, డీఎం ఇంద్ర విక్రమ్ సింగ్, ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ, పీఏసీతోపాటు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌ల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శాంతించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాయపడిన యువకుల బంధువులు, వారి మద్దతుదారులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాకు దిగి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చికెన్ షాపును మూసివేయాలని డిమాండ్ చేశారు. గతంలో చాలా సార్లు ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయని ప్రజలు చెప్పారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో కర్ఫ్యూ విధించినట్లు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందినవెంటనే తగిన చర్యలు తీసుకుంటామని డీఐజీ దీపక్ కుమార్ తెలిపారు.