దేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌లపై సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కేవలం వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
రూ.3 వేలు పెట్టి ఈ కొత్త వార్షిక పాస్ కొనుగోలు చేస్తే.. ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు (ఈ రెండింటిలో ఏది ముందుగా ముగిస్తే అది తుది గడువు) జాతీయ రహదారులపై ప్రయాణం చేయవచ్చు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ వర్తిస్తుంది. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు ఆ పాత ఫాస్టాగ్‌తోనే టోల్‌పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే నచ్చినవారు మాత్రమే దీన్ని కొనుగోలు చేయొచ్చని కేంద్రం ఇదివరకే ప్రకటించింది.
ఫాస్టాగ్ యాక్టివేషన్ ఇలా
ఫాస్టాగ్ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌లో లింక్ అందబాటులో ఉంది. అలాగే ఎన్‌హెచ్‌ఏఐ, రహదారి రవాణా, హైవే మంత్రిత్వశాఖ వెబ్‌సైట్లలో కూడా ఈ లింక్ మనకు కనిపిస్తోంది. ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఆర్‌్సీ, వాహన యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫొటో, కేవైసీ డాక్యుమెంట్లు, ఐడెంటిటీ ఫ్రూఫ్, అడ్రస్ ఫ్రూఫ్ వంటి పత్రాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ పూర్తయ్యాక వినియోగదారులు రూ.3 వేలు పేమెంట్ చేయాలి. ఆ తర్వాత 2 గంటల్లోపు ఫాస్టాగ్ యాక్టివేట్ అవుతుంది.