ట్రాక్టర్ ర్యాలీలో అపశృతి.. రైతు మృతి

Farmer part of rally dies protesters allege cops fired at his tractor.కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ట్రాక్టర్ ర్యాలీలో అపశృతి.. రైతు మృతి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 3:52 PM IST
ట్రాక్టర్ ర్యాలీలో అపశృతి.. రైతు మృతి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా నేడు ట్రాక్ట‌ర్ ర్యాలీకి అనుమ‌తులు తీసుకున్నారు. రైతుల ర్యాలీ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మొహ‌రించింది. గత రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికపై తమ ఉద్యమ జెండాను ఎగురవేశారు. బారికేడ్లు, లాఠీలు, టియర్‌ గ్యాస్‌ ఆందోళనల మధ్య ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తతలకు దారితీసింది. చివరకు వీటన్నిటినీ అధిగమించి వేలాదిగా ఎర్రకోటకు చేరుకోవడం విశేషం.

రిపబ్లిక్‌ డే పరేడ్‌ కంటే ముందే ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టిన రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోకి వివిధ ప్రాంతాల నుంచి అడుగుపెట్టారు. రాజ్‌ప‌థ్‌లో గ‌ణ‌తంత్ర వేడుక‌లు జ‌రుగుతుండ‌డంతో.. రైతుల్ని ఆపేందుకు పోలీసులు య‌త్నించ‌డంతో ప‌లుచోట్ల ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రైతుల‌న్ని నియంత్రించేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ఈ క్ర‌మంలో త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల వాహ‌నాలు కూడా స్వ‌ల్పంగా ధ్వంసం అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ITO దగ్గర పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించినట్లుగా రైతులు ఆరోపించారు. ఢిల్లీలోని ఐటిఓలో రైతులు, జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో పోలీసుల కాల్పుల్లో ఉత్తరాఖండ్ రైతు చనిపోయినట్లుగా రైతుల బృందం వెల్లడించింది. ఆ వ్యక్తిని నవనీత్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు మాత్రం అతను విన్యాసాలు చేస్తుండగా అదుపుతప్పి పడిపోయి చనిపోయినట్లు చెబుతున్నారు. చనిపోయిన రైతుపై జాతీయ జెండాను కప్పి నివాళులు అర్పిస్తున్నారు రైతులు.


Next Story