హిందీ వెబ్‌సిరీస్‌ను అనుసరించి నకిలీ కరెన్సీ ప్రింట్.. ఆరుగురు అరెస్ట్
సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రజలపై చాలా వరకు ప్రభావితం చూపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 July 2024 10:15 AM ISTహిందీ వెబ్‌సిరీస్‌ను అనుసరించి నకిలీ కరెన్సీ ప్రింట్.. ఆరుగురు అరెస్ట్
సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రజలపై చాలా వరకు ప్రభావితం చూపిస్తున్నాయి. కొన్ని క్రైమ్ సీన్లను అనుసరించి పలువరు నేరాలకు పాల్పడిన సంఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో ఆరుగురు సభ్యులు హిందీ వెబ్‌సిరీస్‌ను అనుసరించి నేరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గ్యాంగ్ హిందీలో వచ్చిన 'ఫర్జీ'ని స్ఫూర్తిగా పొంది నకిలీ కరెన్సీని ప్రింట్ చేసి.. చలామణి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు.
గోకాక్ పట్టణంలో కబడగట్టి గుడ్బ వద్ద కారును అడ్డుకుని తనిఖీలు చేయగా.. నకిలీ కరెన్సీ పట్టుబడిందని పోలీసులు చెప్పారు. కారులో 305 నకిలీ రూ.100 నోట్లు, 6,792 రూ.500 నోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో.. ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో అన్వర్ యాదవ్, సద్దాం యాదల్లి, రవి హ్యగాడి, దుండప్ప ఒనషెనవి, విట్టల్ హోసతోటల్, మల్లప్ప కుండలి ఉన్నారు. పూర్తిగా నకిలీ రూ.100, రూ.500 మాత్రమే వీరు ప్రింట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ముదలగిలోని ఓ ఇంట్లో రాత్రి సమయాల్లో నకిలీ కరెన్సీని ప్రింట్ చేస్తున్నట్లు తేలిందని చెప్పారు. ముఠా కార్యకలాపాలను ప్రభావితం చేసిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లో చిత్రీకరించిన మాదిరిగానే ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు.
ఇక నిందితుల నుంచి మొత్తం 5,23,900 విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్, స్క్రీనింగ్ బోర్డు, పెయింట్, ప్రింటింగ్ పేపర్‌తో పాటు ఆరు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. గోకాక్ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు అయ్యిందని బెళగావి ఎస్పీ భీమశంకర్ వెల్లడించారు. పోలీసుల విచారణలో ఇప్పటికే నిందితులు ఇప్పటికే లక్ష రూపాయల నిజమైన కరెన్సీకి నకిలీ నోట్లను మార్చారని తెలిసింది.