రిజైన్ మోదీ హ్యాష్ ట్యాగ్ పై పెద్ద దుమారం

Resigned Modi Hashtag on Facebook.#ResignModi అంటూ హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అలాంటి హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 12:31 PM GMT
Resigned Modi Hashtag on Facebook

భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రబలడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చర్యలేనని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. మోదీ రాజీనామా చేయాలని పలువురు నేతలు కూడా డిమాండ్ చేశారు. మరికొందరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు . ఈ సమయంలో #రిజైన్‌మోదీ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. #ResignModi అంటూ హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అలాంటి హాష్ ట్యాగ్ లన్నింటినీ ఫేస్ బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దానిపై విమర్శలు రావడంతో ఫేస్ బుక్ స్పందించింది.

పొరపాటున జరిగిందంటూ ప్రకటించడం కూడా జరిగింది. ఆ హాష్ ట్యాగ్ లతో కూడిన పోస్టులను బ్లాక్ చేయాలంటూ భారత ప్రభుత్వం తమనేమీ అడగలేదని కూడా అంటోంది. కొన్ని పోస్టులు తమ కమ్యూనిటీ ప్రమాణాలకు లోబడి లేవని, అందుకే వాటిని బ్లాక్ చేశామని తెలిపింది. కేవలం భారత్ లో మాత్రమే వాటిని నిషేధించింది. దాదాపు 3 గంటల పాటు ఆ పోస్టులను బ్లాక్ చేసింది. ఆ తర్వాత పోస్టులను పునరుద్ధరించింది. ఇక #రిజైన్‌మోదీని బ్లాక్ చేయాలని ఫేస్‌బుక్‌ను కోరలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

'వాల్‌స్ట్రీట్ జర్నల్' పత్రికలో ప్రచురితమైన కథనాలు దురుద్దేశంతో కూడినవని మండిపడింది. ఫేస్‌బుక్ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించడాన్ని ప్రజల అసమ్మతిని అణచివేసేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా పేర్కొంటూ 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన కథనం దురుద్దేశపూరితమని తెలిపింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తొలగించాలని కోరుతూ ఎటువంటి ఆదేశాలను ప్రభుత్వం ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపింది. 2021 మార్చి 5న కూడా వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ బూటకపు వార్తను ప్రచురించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫేస్‌బుక్‌, ట్విటర్, వాట్సాప్ ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తామని భారత ప్రభుత్వం బెదిరిస్తోందని ఓ బూటకపు వార్తను ప్రచురించిందని తెలిపింది.


Next Story