శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవాగ్జిన్ టీకా
Expert Panel Recommends COVID Vaccine Covaxin In 2-18 Age Group.దేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే
By తోట వంశీ కుమార్ Published on 12 Oct 2021 3:25 PM ISTదేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే కరోనా టీకాలను అందిస్తూ వస్తున్నారు. 2 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందుబాటులో లేని సంగతి తెలిసిందే. చిన్నారులకు టీకాలు అందించేందుకు చాలా సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే చిన్నారులకు సంబంధించి టీకాలపై ట్రయల్స్ నిర్వహించి.. ఆ డేటాను కేంద్ర ఆరోగ్య శాఖకు అందజేసింది. 2 నుంచి 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు నిపుణుల కమిటీ మంగళవారం పచ్చజెండా ఊపింది. కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిపార్సు చేసింది.
కేంద్రం నుంచి అనుమతి వస్తే.. భారత్‌లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదట కరోనా వ్యాక్సిన్ ఇదే కానుంది. చిన్నారులకు ఇచ్చే టీకా కూడా రెండు డోసుల టీకానే. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ 2 నుంచి 18 ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్ టీకా 2,3 దశల ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన నిపుణుల బృందం కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతులు జారీ చేయాలని సిపార్సులు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం అనుమతి వస్తే.. మరికొన్ని రోజుల్లోనే విపణిలోకి వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వనున్న విషయం తెలిసిందే.