క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.4లక్ష‌ల ప‌రిహారం..!

Ex-gratia for Covid Deaths.క‌రోనా వైర‌స్ ముప్పును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ చ‌ట్టం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 4:05 AM GMT
క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.4లక్ష‌ల ప‌రిహారం..!

క‌రోనా వైర‌స్ ముప్పును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ చ‌ట్టం ప‌రిధిలోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు ప‌రిహారాన్ని చెల్లించే అంశం తెర‌పైకి వ‌చ్చింది. కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్టు నుంచి పది రోజుల సమయం కోరింది.

ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఒక్కొ క‌రోనా మ‌ర‌ణానికి రూ.4ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం చెల్లించాల‌ని, మ‌ర‌ణ‌ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల జారీకి ఆదేశాలివ్వాల‌ని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ల‌పై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది. బీహార్ లో క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ .4 లక్షల పరిహారాన్ని అందిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ట్లు మీడియా ద్వారా త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు న్యాయ‌మూర్తులు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ప్రభుత్వం ఈ పిటిషన్‌ను ప్రతివాదిగా తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలిస్తుందని వెల్లడించారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. అందుకు తిరస్క‌రించిన ధ‌ర్మాస‌నం..కేంద్ర ప్ర‌భుత్వ స్పంద‌న‌కు ఇప్ప‌టికే ప‌ది రోజుల స‌మ‌యాన్ని ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేసింది. ఈ నెల 18 క‌ల్లా కేంద్ర‌ప్ర‌భుత్వం త‌మ స‌మాధానాన్ని పిటిష‌న‌ర్ల‌కు అంద‌జేయాల‌ని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 21న చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది.


Next Story